ఎలా చనిపోయాడండి?

"ఎలా చనిపోయాడండి?" ప్రశ్నించాడతను పరామర్శకు వచ్చి దుఃఖిస్తున్న బంధువులతో...
"మతిమరుపు రోగమండీ!" అని చెప్పి మళ్ళీ దుఃఖించసాగారు ఆ బంధువులు.
సమాధానం విన్న అతనికి ఆశ్చర్యం, నవ్వు ఒకేసారి వచ్చాయి.
నవ్వితే బావుండదని దాన్ని లోలోపలే మ్రింగి "మతిమరుపుతో చనిపోతారా ఎవరైనా? ఏం మర్చిపోయాడు ఇంతకీ? " తిరిగి ప్రశ్నించాడతను ఇక మిగిలిన ఆశ్చర్యంతో...
"ఊపిరి తీయడం" అని చెప్పి మళ్ళీ బిగ్గరగా దుఃఖించసాగారు ఆ బంధువులు.
ఆశ్చర్యంతో ఇతనికి కూడా ఊపిరి ఆగిపోతుందేమో అనిపించింది.
"ఊపిరి తీయడమా? అదెలా మర్చిపోతారు??" తిరిగి ప్రశ్నించాడతను టెన్షన్ తట్టుకోలేక....
"మాయదారి స్మార్ట్ ఫోనొకటి కొనుక్కున్నాడు..అదే పనిగా వాట్సాప్,ఫెస్ బుక్ అంటూ ఏవేవో చూస్తూ దానితోనే గడిపేవాడు...లేదా టీవీలో లీనమౌతూ గడిపేవాడు!"
"గుండెల నిండా ఊపిరి తీయడం మర్చిపోతుండేవాడు...ఎంత చెప్పినా వినేవాడు కాదు..ఫోన్ ఉంటే చాలు! లోకాన్ని మర్చిపోయ్యేవాడు!! క్రమంగా సరియైన ఊపిరి తీయడం మర్చిపోయి..మర్చిపోయి మెల్లమెల్లగా రోగగ్రస్తుడై చచ్చిపోయ్యాడండి బాబుగారు...చచ్చిపోయ్యాడు!!"
"చివరి దశలో కారణం తెలిసింది...కానీ లాభం లేకపోయింది.. బ్రతికించుకోలేక పోయామండి బాబుగారు!...బ్రతికించుకోలేక పొయ్యాము!!." అని సమాధానం చెప్పి మళ్ళీ బిగ్గరగా ఏడవసాగారా బంధువులు."
సమాధానం విన్న అతను కొంచెం భయంతో భుజాలు తడుముకుని గుండెలనిండా ఊపిరి తీయడం అభ్యాసం చేయసాగాడు అతిగా ఫోన్ వాడకం తగ్గించాలని నిర్ణయించుకుంటూ!!

Comments